వేములవాడలో ఎడతెరిపిలేని వర్షాలు..
మూలవాగు ఉధృతికి మామిడిపల్లి–నిజామాబాద్ రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచివేత
జలకళ సంతరించుకున్న చెరువులు..
ఆనందంలో రైతులు
వేములవాడ, ఆంధ్రప్రభ: వేములవాడ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, వాగుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రైతాంగంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూలవాగు ఉధృతికి పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కోనరావుపేట మండలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహానికి మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న రహదారి కొంత భాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి తెగిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేయలేని దుస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా మూలవాగుపై వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు
తెగిపోయిన రహదారి వద్ద ప్రమాదాలు జరగకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆ మార్గంలో వెళ్లకుండా వాటర్ ట్యాంకర్ను అడ్డుగా ఉంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

హనుమాజీపేట వద్ద రాకపోకలకు అంతరాయం లేదు
వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట వద్ద మూలవాగు, నక్కవాగులపై వంతెనల నిర్మాణం పూర్తవడంతో ప్రస్తుతం అక్కడ రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు. గత ఏడాది ఇదే సీజన్లో హనుమాజీపేట పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వంతెనలు అందుబాటులోకి రావడంతో ఈసారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు.
