ఉప్పొంగిన వాగు.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: ఆసిఫాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తుంపల్లి–మొరం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న లో-లెవల్ వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తుంపల్లి, మొరం గ్రామాలతో పాటు 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అత్యవసర పనులు, వైద్య అవసరాల కోసం వెళ్లాల్సిన వారు వరద తగ్గే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ఉద్ధృతి దృష్ట్యా లో-లెవల్ వంతెనను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచిస్తూ, వరద పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.