భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ముళ్లకట్ట, ఆంధ్రప్రభ: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముళ్లకట్ట, రాంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముళ్లకట్ట గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం జనార్దన్ విజ్ఞప్తి చేశారు. తాగునీరు కలుషితమై డయేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.

వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వొద్దని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల రక్షణ కోసం గ్రామపంచాయతీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని సర్పంచ్ ఈసం జనార్దన్ తెలిపారు.