ఖర్గేను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రభ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఖర్గేతో విలువైన చర్చ జరిగిందని, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అందించిన మార్గనిర్దేశం తమకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరుపై విస్తృత సమీక్ష..
అంతకముందు, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేసే అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు, ఎన్నికల హామీల అమలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నాయకత్వం సూచించినట్లు సమాచారం.
అలాగే ప్రజల నుంచి వచ్చే సమస్యలను వేగంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం, జిల్లా, నియోజకవర్గం, మండల, బూత్ స్థాయి కమిటీల పనితీరును మెరుగుపరచడం, సభ్యత్వ విస్తరణ, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
రానున్న రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా స్పందించే కార్యాచరణపై కూడా సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్‌ను మరింత ప్రజలకు చేరువ చేయాలని అధిష్ఠానం దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.
