ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
- చంచల్‌గూడ జైలుకు తరలింపు
- క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం జాతీయ పోలీస్ అకాడమీలో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు, వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటిలో మెడ, గొంతు వద్ద గాయాలు, శరీరంపై ఇతర గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు అనంతరం పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అనంతరం మిర్యాలగూడ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు ఆగస్టు 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవమని, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు బాధితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
