వరద ఉధృతితో రాకపోకలు నిలిపివేత

బ్రాహ్మణపల్లి–రాగినేడు కల్వర్టుపై ప్రమాదకర పరిస్థితి..

ప్రత్యామ్నాయ మార్గాల వినియోగానికి సూచన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి–రాగినేడు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.

భారీ వర్షాల కారణంగా కల్వర్టుపై గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో అధికారులు, గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. వాహనాలు ఆ మార్గంలో వెళ్లకుండా కల్వర్టుకు ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు, ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేశారు.

రాగినేడు పరిసర గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. రాగినేడు నుంచి బొంపెల్లి మీదుగా అప్పన్నపేట, మేరపల్లి గ్రామాల మీదుగా ప్రయాణించాలని రాగినేడు పంచాయతీ కార్యదర్శి సంతోష్ రెడ్డి తెలిపారు.

వరద నీటి ఉధృతి తగ్గే వరకు ప్రజలు ప్రమాదకర మార్గాల్లో ప్రయాణించకుండా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.