బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రుల రాస్తారోకో

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రుల రాస్తారోకో
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పెద్దపల్లి పట్టణ ఎస్ఐ లక్ష్మణ్ రావు పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు.
ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని వాపోయారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఆందోళనలో నాయకులు బాలసాని లెనిన్, స్టాలిన్, సీపెళ్లి రవీందర్, మోదుంపల్లి శ్రావణ్, కల్లేపల్లి అశోక్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
