గ్రానైట్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- మాఫియాపై కఠిన చర్యలు: కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు, ఆంధ్రప్రభ: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. బుధవారం గ్రానైట్ అక్రమ రవాణా మరియు అక్రమ మైనింగ్ నివారణ దిశగా రెవిన్యూ, గనులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, పోలిస్, జీఎస్టీ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ చెల్లించకుండా అక్రమ రవాణా చేయటం చట్టరీత్యా నేరమని, అక్రమ మైనింగ్, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్, రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు, గనులు,అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించబోమన్నారు. అక్రమ గ్రానైట్ నివారణ దిశగా పోలీస్ ,రెవిన్యూ,.రవాణా, జీఎస్టీ అధికారులు కమిటి గా ఏర్పడి రాష్ట్ర సరిహద్దులు మరియు జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి అని,చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీ చేయాలి, మూడు షిఫ్టుల వారిగా పనిచేయాలి అని తెలిపారు. 2025 జులై నుండి మార్చ్ 2026 వరకు ఇప్పటి వరకు మొత్తం 8 కేసులు ,అందులో భాగంగా దాచేపల్లి 4,కారంపూడి 1, నకరికల్లు 1, మాచర్ల 1,మాచవరం 1 నమోదు అయ్యాయి అని వారిపైన తీసుకున్న చర్యలపైనే వివరాలు అడిగారు. అలాగే జిల్లాలో ఏ మండలం నుండి అక్రమ మైనింగ్ జరిగిన సహించేది లేదు అని అధికారులు అప్రమత్తగా ఉండాలి అని లేనిచో శాఖ పరమైన చర్యలు తీసుకుంటాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంతోష్ ,డీఆర్వో అద్దయ్య అధికారులు పాల్గొన్నారు.
