ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాగులు, వరద ప్రాంతాల వద్దకు వెళ్లొద్దు: ఎస్సై టీ.వి.ఆర్. సూరి
మంగపేట, ఆంధ్రప్రభ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగపేట ఎస్సై టీ.వి.ఆర్. సూరి మండల ప్రజలకు సూచించారు.
బుధవారం మండలంలోని బొమ్మాయిగూడెం–కొత్తూరు మొట్లగూడెం మధ్య గౌరారం వాగు ఉధృతిని, నర్సింహాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామ సమీపంలోని కూడలి ఒర్రె వరద ప్రవాహాన్ని, అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు పరిస్థితిని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, వాగు ఉధృతి అధికంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా పాత, మట్టి గోడల ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అలాంటి ఇళ్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండరాదని హెచ్చరించారు.
గోదావరిలో కొత్త నీరు వస్తున్నందున చేపల వేట కోసం నది వద్దకు వెళ్లవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని కోరారు.
రైతులు, వ్యవసాయ కూలీలు వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తడిసిన విద్యుత్ స్తంభాలను తాకరాదని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని సూచించారు.
నీటి ప్రవాహం అధికంగా ఉన్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయరాదని, వర్షాకాలంలో రహదారులు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలను అధిక వేగంతో నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని ఎస్సై టీ.వి.ఆర్. సూరి సూచించారు.
