భారీ వర్షాలపై జిల్లా పోలీసుల అప్రమత్తత
వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన..
అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, నీరు నిలిచే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కల్వర్టులను ప్రజలు దాటకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉరుములు, మెరుపుల సమయంలో గ్రామస్తులు అడవి ప్రాంతాలకు వెళ్లకుండా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గోదావరి పరివాహక మండలాల్లో నదీ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు.
వర్షాల సమయంలో చేపల వేట, ఈత, వరద నీటిలోకి వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో వరదలతో ప్రభావితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు.
ప్రతి పోలీసు వాహనంలో తాళ్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్‌లు లేదా టైర్ ట్యూబులు వంటి అత్యవసర రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచాలని, విధుల్లో ఉన్న ప్రతి పోలీసు సిబ్బంది తప్పనిసరిగా రెయిన్‌కోట్లు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు.
విద్యుత్ తీగలు తెగిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వంటి ఘటనలు గుర్తించిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకునేలా సమన్వయం చేయాలని సూచించారు. మూసుకుపోయిన డ్రైనేజీలను రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని జేసీబీల సహాయంతో వెంటనే శుభ్రం చేయించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంకలు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనీయవద్దని ఎస్పీ కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.
