విజయవాడలో మెగా టూరిజం ప్లాన్..!
- శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు..!
- డీపీఆర్‌ల నుంచి గ్రౌండింగ్ దిశగా..
- రూ.75 కోట్ల ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టు… జూలై–2027 నాటికి పూర్తి..
- నవరాత్రుల్లో ‘విజయవాడ ఉత్సవ్’కు ముందస్తు ఏర్పాట్లు..
- కొండపల్లి ఖిల్లాలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి చర్యలు
- పర్యాటక అభివృద్ధితో జిల్లాకు ఆదాయం, ఉపాధి అవకాశాలు
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుల (డీపీఆర్) దశలోనే నిలిచిపోకుండా వేగంగా గ్రౌండింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా జిల్లాకు ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భవానీ ఐలాండ్‌లో రూ.75 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన పూర్తిచేసి జూలై–2027 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, 500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ వంటి ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భవానీ ఐలాండ్‌లోని అమరావతి బోటింగ్ క్లబ్‌ను భద్రతా ప్రమాణాలతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన మినీ థియేటర్‌ను విద్యార్థులకు విద్యా, వైజ్ఞానిక, అవగాహన చిత్రాల ప్రదర్శనకు వినియోగించాలని ఆదేశించారు.
ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంఘం వద్ద నదీహారతి కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు వైదిక కమిటీ సూచనల మేరకు 30 డిగ్రీల డైమెన్షన్‌తో ప్రత్యేక ప్లాట్‌ఫాంను నిర్మించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడంతో పాటు రహదారి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. నదీహారతి నిర్వహణకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు, విద్యుత్ సదుపాయాలపై కూడా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ను ఈ ఏడాది నవరాత్రుల సందర్భంగా పున్నమి ఘాట్, ఫెర్రీ ఘాట్, బసవపున్నయ్య స్టేడియంలో మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పర్యాటకులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సిబార్ డిస్నీల్యాండ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకం నిధులను జిల్లాలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొండపల్లి ఖిల్లాను అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ట్రెక్కింగ్, ర్యాపెల్లింగ్ వంటి సాహస క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత టికెటింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రతి పర్యాటక ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. లక్ష్మీశ స్పష్టం చేశారు. విజయవాడను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పర్యాటక శాఖ, అటవీశాఖ, ఏపీటీడీసీ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
