రంగనాథ్ వ్యవహారంపై ప్రభుత్వ కీలక నిర్ణయం

డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్న తెలంగాణ సర్కార్
హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై అప్పీల్
న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ చర్చలు

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఈ అంశాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సమాచారం ప్రకారం, ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమై తదుపరి న్యాయ వ్యూహంపై చర్చించనున్నారు. పూర్తి తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సింగిల్ బెంచ్ ఏమన్నది?
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించినట్లు న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ సందర్భంగా రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు కోరినప్పటికీ, వాటిని ధర్మాసనం ఆమోదించలేదని సమాచారం.

డివిజన్ బెంచ్‌లో సవాల్‌కు సన్నాహాలు
సింగిల్ బెంచ్ తీర్పు పూర్తి ప్రతిని అందుకున్న తర్వాత అందులోని న్యాయపరమైన అంశాలను పరిశీలించి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ న్యాయ బృందం ప్రాథమికంగా వివిధ న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం దాఖలు చేసే అప్పీల్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.