AP| కుప్పం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..
మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి పిలుపు
AP|కుప్పం, ఆంధ్రప్రభ: కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో మూడో రోజు భాగంగా కుప్పం మండలం వసనాడులో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
కుప్పం ప్రజలు ఎన్నో ఏళ్లుగా చంద్రబాబుపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టుగానే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని భువనేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు నమ్మి మరోసారి బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో, సైబరాబాద్‌ను నిర్మించడంలో చంద్రబాబు చూపిన దూరదృష్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు.

పిల్లల చదువు కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో “తల్లికి వందనం” పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అలాగే పీ-4 కార్యక్రమాన్ని పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కుప్పం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని భువనేశ్వరి తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పాలన సామర్థ్యంపై నమ్మకంతో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పరిశ్రమలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో కుప్పం యువతకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని అన్నారు.
నీటి సమస్యల పరిష్కారానికి హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చి దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపిన నాయకుడు చంద్రబాబేనని భువనేశ్వరి పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో పోలవరం పనులు అటకెక్కిపోయాయని ఆరోపిస్తూ, వచ్చే ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. చంద్రబాబు ఒకసారి హామీ ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేసే నాయకుడని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త రకం పంటలను కూడా సాగు చేయాలని భువనేశ్వరి సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
పర్యటనలో భాగంగా కుప్పం మండలం పెద్ద బంగారునత్తం సమీపంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హార్టికల్చర్ హబ్‌ను సందర్శించిన భువనేశ్వరి, అక్కడ మహిళా రైతులతో మాట్లాడి మొక్కల పెంపకం, ఆధునిక ఉద్యానవన పద్ధతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ హబ్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం శాంతిపురం మండలం కడపల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్న భువనేశ్వరి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చివరగా, కుప్పం నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు మరింత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని గెలిపించాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, సాగునీరు, మహిళా సాధికారత వంటి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగించాలని ఆమె కోరారు.
