అభివృద్ధికి సహకరించండి..

అసత్య ప్రచారాలు మానండి

సాంకేతిక కారణాలతోనే పనుల్లో స్వల్ప ఆలస్యం..

త్వరలో పూర్తి చేస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణాభివృద్ధిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయ విమర్శలు మాని అభివృద్ధి పనులకు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు సూచించారు.

బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడటం బీఆర్ఎస్ నాయకులకే చెల్లిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఎలా వినియోగించారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల తొలగింపు (పోల్ షిఫ్టింగ్), సింగరేణి అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా స్వల్ప ఆలస్యం జరుగుతోందని చెప్పారు.

పట్టణ ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము కూడా గమనిస్తున్నామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నాయకత్వంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు హామీ ఇచ్చారు.