వర్షాకాలంలో విద్యుత్ భద్రతే ప్రాణ రక్షణ

విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి:

సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, ప్రజల ప్రాణ భద్రతే విద్యుత్ శాఖకు అత్యంత ప్రాధాన్యమని సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. గృహ వినియోగదారులు, రైతులు, పశువుల కాపరులు, విద్యార్థులు, ప్రజలందరూ విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

వర్షం కురుస్తున్న సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ బోర్డులు, తడి గోడలకు ఆనుకుని ఉన్న విద్యుత్ పరికరాలను తాకరాదన్నారు. తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లకుండా, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.

తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్గులు, గీజర్లు, కూలర్లు, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను తాకరాదన్నారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా మాట్లాడకుండా, ముందుగా ఛార్జర్ తొలగించిన తర్వాతే వినియోగించాలని సూచించారు. ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ చేయించుకోవడంతో పాటు ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలనే ఉపయోగించాలని తెలిపారు. పాడైన వైర్లను వెంటనే మార్చి, విద్యుత్ మరమ్మతులు అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తో మాత్రమే చేయించాలని సూచించారు.

రైతులు వ్యవసాయ మోటార్లను ఆన్ చేసే ముందు స్టార్టర్లు, వైర్లు, స్విచ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు. మోటార్లు, పంపుసెట్లు, జీఐ పైపులు, ఫుట్‌వాల్వ్‌లకు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండాలని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలు సరిచేయడం వంటి పనులు స్వయంగా చేయరాదని హెచ్చరించారు.

వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమే కాక ప్రాణాంతకమని పేర్కొన్నారు. చేపల వేటకు లేదా వన్యప్రాణుల వేటకు విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. విద్యుత్ లైన్ల కింద వ్యవసాయ వ్యర్థాలను కాల్చవద్దని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడిపేటప్పుడు విద్యుత్ లైన్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పిల్లలను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ బోర్డుల వద్ద ఆడనివ్వకూడదన్నారు. పశువులను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు కట్టరాదని, మేతకు తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని సూచించారు.

విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తిని నేరుగా తాకకుండా పొడి కర్ర లేదా ప్లాస్టిక్ వంటి విద్యుత్ ప్రసారం కాని వస్తువులతో వేరు చేసి, వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి వైద్య సహాయం అందించాలని తెలిపారు.

కొత్త భవనాల నిర్మాణంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.2 మీటర్ల భద్రతా దూరం పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యుత్ లైన్లపై కొండీలు వేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. తెగిపోయిన విద్యుత్ తీగలు లేదా ఇతర లోపాలు కనిపిస్తే వాటి వద్దకు వెళ్లకుండా వెంటనే టీజీఎన్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్ సూచించారు.