వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన రాజూర సత్యం
కాలనీల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని హామీ
ఖానాపూర్, ఆంధ్రప్రభ: ఖానాపూర్ పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన పలు కాలనీలను నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజూర సత్యం బుధవారం సందర్శించారు. కాలనీవాసులతో కలిసి పరిస్థితిని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీల్లో వరద నీరు చేరి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. జేసీబీ సాయంతో వరద నీటిని దిగువ ప్రాంతాలకు మళ్లించి కాలనీవాసులకు ఉపశమనం కల్పించినట్లు చెప్పారు.
ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రాజూర సత్యం హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలనీవాసుల సమాచారం అందిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న 11వ వార్డు కౌన్సిలర్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
