రఘునాథపల్లి–జనగామ మార్గంలో ఆర్టీసీ సేవలు అస్తవ్యస్తం
బస్సుల కోసం గంటల నిరీక్షణ
విద్యార్థుల చదువులకు ఆటంకం.. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండల కేంద్రం నుంచి జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బుధవారం ఉదయం 7:25 గంటల నుంచి 8:15 గంటల వరకు ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే రావడంతో బస్సు కోసం వేచి ఉన్న పాఠశాల, కళాశాల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రఘునాథపల్లి మండలంలోని 36 గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రతిరోజూ జనగామకు ప్రయాణిస్తుంటారు. అయితే నిర్ణీత సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రఘునాథపల్లి బస్‌స్టాండ్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని బోర్డుపై పేర్కొన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు ఒకేసారి రెండు, మూడు బస్సులు వస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో గంటల తరబడి ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. దీంతో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. రఘునాథపల్లి–జనగామ మార్గంలో బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేలా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
