Sensex | సెన్సెక్స్ 760కుపైగా పాయింట్లు జంప్.. 24,200 దాటిన నిఫ్టీ..
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరు, విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఉదయం నుంచే లాభాల బాట పట్టాయి.
ఐటీ రంగంపై మదుపర్లు ఆసక్తి చూపడంతో బుధవారం ఐటీ సూచీ దాదాపు 2.5 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ప్రపంచ మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.76 వద్ద బలపడటం కూడా మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది.
మంగళవారం ముగింపులో 76,765 వద్ద ఉన్న సెన్సెక్స్ బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అనంతరం మరింత బలపడుతూ ఉదయం 9:40 గంటల సమయానికి 761 పాయింట్లు ఎగిసి 77,527 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ కూడా లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 219 పాయింట్ల పెరుగుదలతో 24,204 వద్ద ట్రేడవుతోంది.
షేర్ల వారీగా చూస్తే కేపీఐటీ టెక్నాలజీస్, స్విగ్గీ, కొఫోర్జ్, సెయిల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఫీనిక్స్ మిల్స్, మదర్సన్, కేఫిన్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీజీ పవర్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 287 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 396 పాయింట్లు ఎగిసి సానుకూల ధోరణిని ప్రదర్శిస్తోంది.
