విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం..
‘విద్యా జ్యోతి’ ఐదు రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం
ఉట్నూరు, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూరు నిర్వహిస్తున్న “విద్యా జ్యోతి – సామర్థ్యాభివృద్ధి, సమగ్ర ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం” ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని పీఎంఆర్సీ మీటింగ్ హాల్, కేబీ కాంప్లెక్స్‌లో ప్రాజెక్టు అధికారి మంద మకరంద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించడమే ప్రతి ఉపాధ్యాయుడి ఏకైక ధ్యేయం కావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, మంచి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు.
ఉపాధ్యాయులు పాఠ్యాంశాన్ని కేవలం బోధించడం మాత్రమే కాకుండా, పాఠ్య ప్రణాళికను లోతుగా అధ్యయనం చేసి వారాంత ప్రణాళిక ప్రకారం బోధన చేపట్టాలని సూచించారు. తరగతి గదిలో కార్యకలాపాల ఆధారిత బోధన, ఉత్తమ బోధనా పద్ధతులు, వాస్తవ జీవిత ఉదాహరణలను ఉపయోగించి విద్యార్థులకు పాఠ్యాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించాలని తెలిపారు.
విద్యార్థుల్లో లక్ష్య నిర్దేశం అలవాటు పెంపొందిస్తూ, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ప్రాథమిక స్థాయిలో బలమైన అభ్యాస నైపుణ్యాలు పెంపొందితేనే ఉన్నత తరగతుల్లో మెరుగైన అభ్యాస ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఐదు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాస ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా కృషి చేయాలని సూచించారు.
ఉపాధ్యాయుల నుంచి వచ్చే విలువైన సూచనలను శాఖ సానుకూలంగా పరిశీలించి, గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అమలుకు అవసరమైన చర్యలు చేపడతామని ప్రాజెక్టు అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో గోడం చందన్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, నిర్మల్ డీపీవో నిహారిక, ఏసీఎంవో జగన్, ఎస్వో పార్థసారథి, జీసీడీవో ఛాయా, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్‌రావు, రిసోర్స్ పర్సన్స్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలుగు, ఆంగ్లం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

