నరసాపురంలో రేపు స్వచ్ఛంద రక్తదాన శిబిరం..
నరసాపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసాపురంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి (ఎండీవో) ఎం. నాసరు రెడ్డి తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించేందుకు అవసరమైన నిల్వలను పెంపొందించడం, ప్రజల్లో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.

“రక్తదానం – మహాదానం“ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మండల స్థాయి అధికారులు, వైద్యశాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎండీవో ఎం. నాసరు రెడ్డి కోరారు.
