సహజ సేద్యంతోనే నేలకు, పంటలకు రక్షణ: కలెక్టర్ రాజర్షిషా

సేంద్రియ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ఉట్నూర్, ఆంధ్రప్రభ: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు.

మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ వీడియో కాన్ఫరెన్స్‌ను ఉట్నూర్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అధికారులు, రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను అధికంగా వినియోగించడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఆవు పేడ, జీవామృతం, ఇతర సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల సారం పెరిగి దీర్ఘకాలికంగా మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.

ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జిల్లాలో వర్షపాతం లోటు ఉన్న నేపథ్యంలో అంతర పంటలు, మల్చింగ్ విధానాల ద్వారా నేలలో తేమను కాపాడుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, డి-పట్టా రైతులకు కూడా మైక్రో ఇరిగేషన్‌పై భారీ సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు. జిల్లాకు మరో 1,350 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులు రానున్నాయని, పట్టా లేని రైతులు కూడా యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం కల్పించామని తెలిపారు. జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పూర్వకాలపు సేంద్రియ సాగు విధానాలను అనుసరించాలని కోరారు.

మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం కారణంగానే ఎల్‌నినో వంటి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, సాగునీటి సంరక్షణ కోసం ప్రతి రైతు ఇళ్లు, పొలాల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ప్రైవేట్ వ్యాపారులు ప్రచారం చేసే ఆచరణ సాధ్యం కాని హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్లను నమ్మి మోసపోవద్దని రైతులను హెచ్చరించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి రైతు పొలం గట్లపై మొక్కలు నాటాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం మార్గదర్శనం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులను కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలతో సత్కరించారు. అనంతరం రైతులకు మొక్కలు పంపిణీ చేసి, రైతు వేదికలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, తహసీల్దార్ రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఏడీఏలు శ్రీధర్, రామ్‌కిషన్, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, వ్యవసాయ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.