మొక్కుబడిగా మండల స్థాయి ప్రత్యేక సమావేశం
రెండున్నర గంటల్లో ముగిసిన సమీక్షపై అధికారుల తీరుకు విమర్శలు
మంగపేట, ఆంధ్రప్రభ : మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ములుగు జిల్లా మంగపేట మండలంలోని గంపనిగూడెం రైతు వేదికలో మంగళవారం మండల స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు మంగపేట మండల ప్రత్యేక అధికారి (డీపీఓ) కొండా వెంకయ్య అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైంది.
మండలంలోని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి (డీపీఓ) కొండా వెంకయ్య, ఎంపీడీఓ బి. బద్రు, తహసీల్దార్ తోట రవీందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి నేదునూరి చేరాలు, మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, ఆత్మ డైరెక్టర్ గాదె శ్రావణ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశం నిర్వహించిన తీరుపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినప్పటికీ, కేవలం మొక్కుబడిగా నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఉదయం సుమారు 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలకే ముగియడంతో, సుమారు రెండున్నర గంటల్లోనే సమావేశాన్ని ముగించడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
సమావేశానికి సుమారు 15 శాఖల అధికారులు హాజరైనప్పటికీ, ఒక్కో శాఖపై కనీసం 10 నిమిషాల పాటు కూడా సమీక్ష నిర్వహించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించకుండా సమావేశాన్ని ముగించడం పట్ల మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
