ప్రతిభతో మండలంలో తొలి స్థానం.. ఘన సన్మానం

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందెల రాజు ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాల్లో కేసముద్రం మండలంలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని మొహమ్మద్ ఆఫ్రా నిక్ఖత్‌ను ఘనంగా సత్కరించారు.

అలాగే 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు జుజ్జురు ఝాన్సీ, మొహమ్మద్ నఫియా, సనుప మహేష్, తాటికొండ తేజన్య, మొహమ్మద్ అలీషా అబీబా, జాటోత్ శివరాంలను కూడా అభినందించి సన్మానించారు.

అనంతరం ‘బడిబాట’ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బందెల రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

మండల కేంద్రంలోని పాఠశాలలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు జరిగేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ‘బడిబాట’ గోడపత్రికను ఆవిష్కరించారు.

మండల టాపర్‌గా ఆఫ్రా నిక్ఖత్

పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ కేసముద్రంలో చదివిన మొహమ్మద్ ఆఫ్రా నిక్ఖత్ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి అహ్మద్ అలీ, తల్లి కాంట్రాక్ట్ ఉద్యోగిని. ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువుతో పాటు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచింది.

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ చాటింది. గణితం, సైన్స్, సోషల్ సైన్స్, టీ-శాట్ నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి వరకు చేరుకుంది.

తాజాగా పదో తరగతి ఫలితాల్లో 566 మార్కులు సాధించి కేసముద్రం మండలంలో ప్రథమ స్థానం దక్కించుకుని పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply