రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం
- ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
నరసరావుపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సోమవారం పట్టణంలోని బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, వాటిని ప్రజలకు వివరించేందుకే ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు తదితర పథకాల లబ్ధి ప్రజలకు అందుతున్న తీరును ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటున్నామని చెప్పారు. గత రెండేళ్లలో నరసరావుపేట నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.571 కోట్ల ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా రూ.3,216 కోట్ల రుణాలు మంజూరయ్యాయని, అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నరసరావుపేట నియోజకవర్గానికి రూ.680 కోట్ల రుణాలు అందించబడినట్లు తెలిపారు. రైతులు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగాలకు అవసరమైన రుణాలను ప్రజల వద్దకే వెళ్లి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చి 164 అసెంబ్లీ స్థానాల్లో విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ 45 రోజుల ప్రచార కార్యక్రమంలో ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు.
ఏవైనా కారణాల వల్ల తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల లబ్ధి అందని అర్హులను గుర్తించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పట్టణ టిడిపి అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ, మాజీ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
