దమ్మపేట క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేవారెవరు?

40 ఏళ్ల క్రితమే గ్రామ స్థాయి నుంచి రంజీ వరకు సత్తా చాటిన క్రీడాకారులు..

నేడు శిక్షణ, సౌకర్యాల కొరత

దమ్మపేట, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 100 సంవత్సరాల క్రితమే క్రికెట్ ప్రారంభమైనప్పటికీ, 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్ (ప్రుడెన్షియల్ కప్) సాధించిన తర్వాత దేశంలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగింది.

అయితే దమ్మపేట మండల కేంద్రంలో మాత్రం అంతకుముందే క్రికెట్‌పై విపరీతమైన ఆసక్తి ఉండేది. సుమారు 40 సంవత్సరాల క్రితమే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు రంజీ స్థాయి వరకు పలువురు క్రీడాకారులు దమ్మపేట నుంచి ఎదిగారు.

అప్పట్లో క్రికెట్ ఆడేందుకు ప్రత్యేక మైదానాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోని పొదలను తొలగించి, రాళ్లను చేతులతో తొలగించి క్రీడాకారులే మైదానాలను సిద్ధం చేసుకునేవారు.

1985 నుంచి దమ్మపేట పట్టణంలోని సీపీఎస్ పాఠశాల వెనుక ఉన్న మైదానం, నెమలిపేటలో మాజీ సర్పంచ్, ఎంపీపీ పానుగంటి సత్యం గ్రౌండ్, పసుమర్తి బాబురావు రైస్ మిల్లు ఎదురుగా, మురళీకృష్ణ టైల్స్ ఫ్యాక్టరీ గ్రౌండ్, మల్కారం రోడ్డులోని పసుమర్తి వారి చెలక, జీసీసీ వెనుక, బాలాజీ టాకీస్ పక్కన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో, ట్రైబల్ వెల్ఫేర్ గ్రౌండ్‌లలో గ్రేస్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవారు.

జడ్పీ హైస్కూల్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేసిన క్రీడాకారులు సెలవు రోజుల్లో సీపీఎస్ పాఠశాల వెనుక ఉన్న మైదానంలో సాధన చేసేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సరైన బ్యాట్లు, ప్యాడ్లు లేకుండానే అందుబాటులో ఉన్న వనరులతో సాధన కొనసాగించేవారు.

దమ్మపేట జట్టు ప్రతిభను గుర్తించిన స్వర్గీయ చామర్తి సూర్యనారాయణ శాస్త్రి తొలుత క్రికెట్ కిట్ కొనుగోలుకు సహాయం అందించారు. అనంతరం పలువురు దాతల సహకారంతో జట్టుకు అవసరమైన సామగ్రి సమకూరింది.

1985లో యార్లగడ్డ కేశవరావు, రమేష్, జీపీ, కౌతా ప్రసాద్, మల్లికార్జునరావు (పెద్దమల్లి), చామర్తి ఫణీంద్ర రాజు (ప్రస్తుతం ఖమ్మం సైబర్ క్రైమ్ డీఎస్పీ), నల్లగట్ల కృష్ణకుమార్, కోటా వెంకటేశ్వరరావు, ఎం.ఏ. ఖాదిర్, ఖలీల్, అబ్దుల్ జిన్నా, యార్లగడ్డ ఈశ్వరరావు, పున్నం వెంకటేశ్వరరావు, జోగయ్య, కొయ్యల శ్రీను, గోపాల్, ఎన్‌వీ నాగేశ్వరరావు, యార్లగడ్డ రాంబాబు, తోట మల్లేశ్వరరావు, షేక్ రహీం వంటి క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

1985 నుంచి 2010 వరకు దమ్మపేట క్రికెట్‌కు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఆ తర్వాత తరం క్రీడాకారులు ఆ స్థాయిని కొనసాగించడంలో కొంత వెనుకబడ్డారు.

తదుపరి తరం క్రీడాకారులుగా పరాంకుశం అనిల్ కుమార్ (బాబీ), కామవరపు విజయమారుతి శర్మ, సాయి ప్రసాద్ శాస్త్రి, మురహరి క్రాంతికుమార్, రమేష్ (పీఈటీ), మధు, ఈషా, రొయ్యల, బాబూరావు, అరవింద్, శశికాంత్, శ్రీధర్, రాజేష్, తోట శ్రీనివాసరావు, దారా శ్రీనివాసరావు (ఫ్యాన్సీ), మల్లి, గవర నాగేశ్వరరావు, లక్స్, ప్రవీణ్, ప్రమోద్, రాము, గట్ల నాగరాజు తదితరులు ప్రతిభ చూపారు.

ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు, బ్యాట్స్‌మెన్‌లుగా దమ్మపేట క్రీడాకారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. ఒక సమయంలో దమ్మపేట జట్టు వస్తుందంటే అశ్వారావుపేట, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పాల్వంచ, భద్రాచలం తదితర ప్రాంతాల జట్లు అప్రమత్తంగా ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు.

డీసీసీ (దమ్మపేట క్రికెట్ క్లబ్) ఏర్పాటు చేసి ప్రతిభ ఆధారంగా ఏ టీం, బీ టీంలుగా విభజించి క్రీడాకారులకు అవకాశాలు కల్పించేవారు. ఏ టీంలో స్థానం కోసం బీ టీం క్రీడాకారులు తీవ్రంగా శ్రమించేవారు.

డీసీసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కప్‌తో పాటు ఉమ్మడి జిల్లా స్థాయి టోర్నమెంట్లలో దమ్మపేట క్రీడాకారులు పాల్గొని పలుమార్లు ట్రోఫీలు సాధించారు.

ప్రస్తుతం దమ్మపేటలో క్రికెట్‌పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎక్కువగా టెన్నిస్ బాల్ క్రికెట్‌కే పరిమితమవుతున్నారు.

పట్టణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తే దమ్మపేట క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని పూర్వ క్రీడాకారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.