విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లల చదువులో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి: జిల్లా నోడల్ అధికారి వెంకన్న
చిట్యాల, ఆంధ్రప్రభ: మారుమూల ప్రాంతాల విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల విద్యలో భాగస్వాములు కావాలని ఇంటర్మీడియట్ విద్య జిల్లా నోడల్ అధికారి భూక్య వెంకన్న అన్నారు.
సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బి. శ్రీదేవి అధ్యక్షతన పేరెంట్స్–టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తవటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, కళాశాల అభివృద్ధికి దాత బీరవోలు నిర్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఈఏపీసెట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
జిల్లా నోడల్ అధికారి భూక్య వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడటం, వారి చదువుపై నిరంతరం పర్యవేక్షణ చేయడం, కళాశాల కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండటం వంటి అంశాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు.
పేరెంట్స్–టీచర్స్ సమావేశాలకు ప్రతి తల్లిదండ్రులు హాజరై పిల్లల చదువు, ప్రగతి గురించి అధ్యాపకులతో చర్చించాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
