31వ వార్డులో కూలిపోయే స్థితిలో బ్రిడ్జీలు
శిథిలావస్థకు చేరిన వంతెనలతో ప్రజల్లో ఆందోళన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 31వ వార్డులో మహమ్మద్ ఖాసీం బస్తీ–బాబు క్యాంపు బస్తీల మధ్య సల్లేజీ డ్రైన్‌పై నిర్మించిన రెండు బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిలకు ప్రస్తుతం బీటలు పడి, స్లాబులు దెబ్బతిన్నాయని, చుట్టుపక్కల గోడలు కూడా బలహీనంగా మారాయని ప్రజలు చెబుతున్నారు.
ఈ వార్డులో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు లయోలా, అభ్యాస పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఈ బ్రిడ్జిల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు.
అలాగే ఆర్యవైశ్య భవన్, పద్మశాలి భవన్, తాపీ కార్మిక సంఘం భవనాలకు వెళ్లే ప్రజలు సైతం ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో పోచమ్మ చెరువు వరద నీరు, బెల్లంపల్లి బస్తీ, బజార్ ఏరియాకు చెందిన వరద నీరు సల్లేజీ డ్రైన్‌లోకి చేరి ఉప్పొంగి ప్రవహిస్తోందని తెలిపారు.
డ్రైన్‌లోకి కొట్టుకొచ్చిన చెత్త చెదారం బ్రిడ్జి మధ్యలోని గోడలకు అడ్డుపడి పేరుకుపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు.
ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే స్పందించి పాత స్లాబులను తొలగించి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్త బ్రిడ్జీలు నిర్మించాలి
ముప్పిడి బుచ్చిబాబు, మహమ్మద్ ఖాసీం బస్తి మాట్లాడుతూ.. సల్లేజీ డ్రైన్‌పై నిర్మించిన పాత బ్రిడ్జిలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉందని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
వనజాజైన్, హనుమాన్ బస్తీ మాట్లాడుతూ.. లయోలా స్కూల్, బాబు క్యాంపు బస్తీకి వెళ్లే మార్గంలోని బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా
31వ వార్డు కౌన్సిలర్ బండారి స్రవంతి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తమ వార్డులోని సల్లేజీ డ్రైన్‌పై రెండు బ్రిడ్జిలు ఉన్నాయని, అవి మూడు దశాబ్దాల క్రితం నిర్మించడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.
బాబుక్యాంపు బస్తీ లయోలా స్కూల్ మార్గంలోని బ్రిడ్జి, మహమ్మద్ ఖాసీం బస్తీ నుంచి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే మార్గంలోని మరో బ్రిడ్జి పరిస్థితిని మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త బ్రిడ్జిలు మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.
ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
