పేదల సంతోషమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..

  • టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఆంధ్రప్రభ : పేదల కళ్లల్లో సంతోషాల కాంతులు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రానున్న రోజుల్లో 50వ డివిజన్‌లో నెలకొన్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. స్థానిక 50వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్, స్థానిక కార్పొరేటర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

మహిళలు హారతులతో నాయకులకు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు, కోస్తాంధ్ర ప్రగతి పేరుతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచారం దోహదపడుతుందని అన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి రహదారులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

50వ డివిజన్‌లో స్థానికులు ప్రస్తావించిన అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో-ఆప్షన్ సభ్యుడు ఎస్సెమ్మార్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.