‘మిస్సైల్ మ్యాన్’ కలాంకు వైసీపీ నివాళి

  • ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం
  • దేశ యువతకు కలాం చిరస్మరణీయ స్ఫూర్తి: వైసీపీ నేతలు
  • నిరాడంబరత, దేశభక్తికి ప్రతీకగా కొనియాడిన నాయకులు
  • శాస్త్ర సాంకేతిక రంగంలో భారత ఖ్యాతిని చాటిన మహనీయుడు
  • పార్టీ నాయకులు, మైనార్టీ విభాగం ప్రతినిధుల నివాళులు

విజయవాడ, ఆంధ్రప్రభ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, ‘మిస్సైల్ మ్యాన్’ డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. డా. కలాం చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ విభాగం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డా. అబ్దుల్ కలాం కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాకుండా దేశ యువతకు మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.

క్షిపణి సాంకేతిక రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించి, ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ఠను మరింత పెంచిన మహనీయుడిగా ఆయన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పటికీ నిరాడంబర జీవనం, దేశభక్తి, నైతిక విలువలు, విద్య పట్ల అంకితభావంతో కోట్లాది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. యువత పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని కలాం ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు అన్నారు.

విజ్ఞాన సమాజ నిర్మాణమే ఆయన కల అని, ప్రతి ఒక్కరూ ఆ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మస్తాన్, ఫజలుద్దీన్, బినియా, బాబులాల్, దజావీద్, యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య, మాజీ కార్పొరేటర్ అంబేద్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి ప్రకాష్, శెటికం దుర్గ, డేవిడ్ రాజు, దామోదర్, రాజ్ కమల్, కనకరావు తదితరులు పాల్గొన్నారు.