Ande Sri | భావితరాలకు స్ఫూర్తి
అందెశ్రీకి సీఎం రేవంత్ నివాళి
Ande Sri | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తిగా అందెశ్రీని కొనియాడారు. తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్ఫూర్తిని తన అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవిగా అందెశ్రీ నిలిచారని సీఎం పేర్కొన్నారు. ఆయన కలం నుంచి వెలువడిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని, ప్రతి గేయం ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపిందని అన్నారు.
అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పట్ల ఆయన అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
