భవిష్యత్ తరాలకై భూగర్భ జలాలు పరిరక్షించాలి

మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య

మోత్కూర్, (ఆంద్రప్రభ) : భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య అన్నారు.క్యాచ్ ది రెయిన్ నినాదంతో ఇంకుడు గుంతల ఆవశ్యకత, భూగర్భ జలాల సంరక్షణ, నీటి పునర్వినియోగం అంశాలపై 6వ వార్డులో నిర్వహించిన ఇంటి ఇంటికి అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి, భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని తెలిపారు. నీటి వృథాను నివారించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. అందరు నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని, ప్రతి ఒక్కరు సంరక్షించాలని, కుటుంబ సభ్యులను సైతం ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య , వార్డు అధికారి శ్రావణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.