నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి: డాక్టర్ మౌనిక
చిట్యాల, ఆంధ్రప్రభ : ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ (ఆల్బెండాజోల్) మాత్రలు తీసుకోవాలని వొడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాగల్ల మౌనిక సూచించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (వెలుగు)లో ప్రిన్సిపాల్ గోల్కొండ భిక్షపతి అధ్యక్షతన ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి హాజరై విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అలాగే నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
