పారిశుద్ధ్య యోధులకు కళ్లద్దాల కానుక

సొంత ఖర్చుతో కళ్లద్దాలు అందించిన మనోహర్ ప్రసాద్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య సేవలతో అచ్చంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు తాజా మాజీ కౌన్సిలర్, పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్) తన సొంత ఖర్చుతో కళ్లద్దాలు అందజేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. చూపు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ఇటీవల పబ్లిక్ క్లబ్ అచ్చంపేటలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరంలో పరీక్షలు చేయించగా, వైద్యుల సూచనల మేరకు అవసరమైన కళ్లద్దాలను కొనుగోలు చేసి వారికి బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కాలం నుంచి ఇప్పటి వరకు కానోజు మనోహర్ ప్రసాద్ నిరుపేదలు, కార్మికులు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న చొరవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిలిహరిచంద్ర, తాజా మాజీ కౌన్సిలర్ గౌరీశంకర్, శ్రీవాణి ఆప్టికల్స్ నిర్వాహకులు లింగారెడ్డి, పబ్లిక్ క్లబ్ సభ్యులు మేరె శివ, నాంసాని శ్రీనివాసులు, కృష్ణ, యాదయ్యతో పాటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.