కాజీపేట నూతన బస్టాండ్ భూకేటాయింపు..
రైల్వే జీఎం, డీఆర్‌ఎంతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య భేటీ
కాజీపేట బస్టాండ్ భూకేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని వినతి
చిలుపూర్, ఆంద్రప్రభ : కాజీపేటలో ప్రతిపాదిత నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన రైల్వే భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డా. ఆర్. గోపాలకృష్ణన్‌లను శుక్రవారం స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం భూ మార్పిడి అంశంపై వారితో ఎంపీ విస్తృతంగా చర్చించారు.
కాజీపేట సిగ్నల్ జంక్షన్ పరిధిలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమితో సమాన విలువ ప్రాతిపదికన మార్పిడి చేయాలని రైల్వే శాఖ 2025 జూన్ 4న ప్రతిపాదించినప్పటికీ, ఏడాదికిపైగా గడిచినా ప్రక్రియ ముందుకు సాగలేదని ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరించారు.
భూ మార్పిడి కోసం వరంగల్–హనుమకొండ ప్రాంతంలో అనువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. భూ మార్పిడి ప్రక్రియను పూర్తి చేసేందుకు రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించి, అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భూ మార్పిడి ప్రక్రియలో జాప్యం కారణంగా కొత్త బస్టాండ్ నిర్మాణం ఆలస్యమవుతోందని ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు. సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని త్వరితగతిన సంయుక్త స్థల పరిశీలన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కొత్త కాజీపేట బస్టాండ్ నిర్మాణం పూర్తయితే వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రి-సిటీ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్, జాతీయ రహదారులకు సమీపంలో ఆధునిక బస్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, బస్సుల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, ప్రజా రవాణా అనుసంధానం మెరుగుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.
