Hyderabad Crime | బాలికతో అసభ్య ప్రవర్తన..

దాడిలో వ్యక్తి మృతి
కుల్సుంపురలో ఘటన..
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు..
శాంతిభద్రతల కోసం బందోబస్తు

Hyderabad Crime | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేయగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్సుంపుర ప్రాంతానికి చెందిన అజీజ్ అహ్మద్ అనే వ్యక్తి నాలుగో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిసింది.

సీసీ కెమెరా దృశ్యాలను చూసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో అజీజ్ అహ్మద్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అజీజ్ అహ్మద్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో కుల్సుంపుర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.