గిరిజన రైతు కుటుంబంలో మెరిసిన ఆణిముత్యం..

  • పదో తరగతిలో 575 మార్కులతో ప్రతిభ చాటిన మైలవరం విద్యార్థిని
  • షైనింగ్ స్టార్–2026 అవార్డుకు ఎంపిక
  • రూ.20 వేల నగదు పురస్కారం

మైలవరం, ఆంధ్రప్రభ : పేదరికాన్ని జయించి పట్టుదలతో చదివి ప్రతిభ చాటిన మైలవరం మండలం అనంతవరం గ్రామానికి చెందిన విద్యార్థిని బాణవతు అలేఖ్య రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. స్థానిక ఆక్సిఫోర్డ్ పాఠశాలలో చదువుకున్న ఆమె ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గాను 575 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

అనంతవరం గ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు బాణవతు రవికుమార్ కుటుంబంలో జన్మించిన అలేఖ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువుపై ఏ మాత్రం రాజీపడకుండా కృషి చేసి ఈ ఘనతను సొంతం చేసుకుంది. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని తన విజయంతో మరోసారి నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆమె సాధించిన ఈ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్–2026’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పురస్కారం కూడా అందుకోనుంది.

చదువుతో సాధించిన గుర్తింపు

గ్రామీణ, రైతు కుటుంబానికి చెందిన అలేఖ్య సాధించిన విజయం స్థానికంగా ఆనందోత్సాహాలను నింపింది. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల సెక్రటరీ,కరస్పాండెంట్ వెంకట లక్ష్మి వెంగళ, ఉపాధ్యాయని,ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.