మొక్కల సంరక్షణకు మైత్రి ఫౌండేషన్ చేయూత..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గత నెల పిల్లారిశెట్టి పాలెం గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షించే లక్ష్యంతో, మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.15,000/- విలువైన ట్రీ గార్డులను ఈరోజు గ్రామానికి అందజేశారు.

గ్రామ యువత అభ్యర్థన మేరకు మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ట్రీ గార్డులను మైత్రి ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మైత్రి ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ కేసాని వేణు కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించి ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించాలంటే ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

“మొక్కను నాటడం ప్రకృతికి ఇచ్చే కానుక అయితే, దానిని కాపాడటం భావితరాలకు అందించే వరం. పచ్చని చెట్లు పెరిగితేనే భూమి చల్లబడుతుంది. వర్షపాతం మెరుగుపడి భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతుకు సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదు; ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. మనం నేడు కాపాడే ప్రతి మొక్క రేపటి తరాలకు జీవనాధారంగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్, ఉపాధ్యక్షులు రిలాక్స్ ప్రసాద్, బ్లడ్ కమిటీ చైర్మన్ రమాదేవి, తోకల మాణిక్యరావుతో పాటు గ్రామ పెద్దలు మట్ట గణపతి, కాసాని రాంబాబు, జన్ను వీర వెంకట సుబ్బారావు, మోర్ల వెంకటేశ్వరరావు, కాసాని వెంకట్ నాగేశ్వరరావు, కాగిత సీతారాముడు, పామర్తి కామేశ్వరరావు, కొండెటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ యువతకు, గ్రామ పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికీ మైత్రి ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.