School Controversy | సైదాబాద్ సక్సెస్ స్కూల్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
School Controversy | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ స్కూల్‌లో ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ ప్రార్థనలు (కల్మా, సూరా ఫాతిహా) హోమ్‌వర్క్‌గా ఇచ్చారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థి డైరీలో ఈ సూచనలు కనిపించడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాల యాజమాన్యం, సంబంధిత ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఇది పొరపాటున జరిగిన ఘటనేనని పాఠశాల వివరణ ఇచ్చినట్లు సమాచారం. సంబంధిత ఉపాధ్యాయురాలిపై పాఠశాల యాజమాన్యం సేవల నుంచి తొలగింపు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
