రూ.3,216 కోట్ల రుణాల పంపిణీకి సర్వం సిద్ధం

  • నరసరావుపేటలో క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంపై సమీక్ష..
  • సమన్వయంతో విజయవంతం చేయాలని ప్రతిపాటి పుల్లారావు పిలుపు

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: నరసరావుపేటలో నిర్వహించనున్న భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా రూ.3,216 కోట్ల రుణాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు.

శుక్రవారం నరసరావుపేట ఇండోర్ స్టేడియంలో జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి పాల్గొన్న మంత్రి ప్రతిపాటి పుల్లారావు, కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడంలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా బ్యాంకులు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారీ రుణ పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.