సాగర్‌లో గణనీయంగా తగ్గిన నీటి నిల్వలు
ఖరీఫ్ సాగుపై అనిశ్చితి.. రైతుల్లో ఆందోళన
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు
ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 137.8642 టీఎంసీలు
ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కులు.. అదే స్థాయిలో అవుట్‌ఫ్లో
నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ: నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది (2025) ఇదే తేదీతో పోలిస్తే ఈ ఏడాది (2026) జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గడం ఖరీఫ్ సాగుపై అనిశ్చితిని పెంచుతోంది.
గత సంవత్సరం ఇదే రోజున సాగర్ జలాశయంలో నీటిమట్టం 557.29 అడుగులు ఉండగా, ఈ ఏడాది అది 513.60 అడుగులకు మాత్రమే పరిమితమైంది. అంటే, ఏడాది వ్యవధిలో 43.69 అడుగుల మేర నీటిమట్టం తగ్గింది.
సాధారణంగా జూలై నాటికి సాగర్‌లో ఆశాజనక స్థాయిలో నీటి నిల్వలు ఉండాల్సి ఉంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాకపోవడం, వర్షపాతం కూడా తగినంతగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి చూస్తే ఖరీఫ్ సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, కృష్ణా నదికి భారీగా వరదలు వస్తేనే సాగర్ జలాశయంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. లేకపోతే ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
సాగర్ జలాశయ తాజా వివరాలు

గురువారం సాయంత్రం నాటికి నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 513.60 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 137.8642 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రస్తుతం కుడి, ఎడమ కాలువల ద్వారా ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు. అలాగే ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. అయితే ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాలువల ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో 900 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి వస్తున్న నీటి పరిమాణం పెరగకపోతే ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశముందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
