పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
- మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించి, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
గురువారం రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పుట్టపర్తి చిత్రావతి నదీ పరివాహక ప్రాంతం, బుక్కపట్నం చెరువు, చెరువు మధ్యలో ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి బాబా విగ్రహ స్థలం, కొండపై ఉన్న శ్రీ వెంకటరమణస్వామి ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రతిపాదిత అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, రూపకల్పన, అమలు విధానంపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, చిత్రావతి నదీ తీరాన్ని ప్రకృతి అందాలతో సుందరీకరించి పర్యాటకులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. బుక్కపట్నం చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు, చెరువు మధ్యలో భారీ శ్రీ సత్యసాయి బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తికి వచ్చే భక్తులు, సందర్శకులకు కొత్త పర్యాటక ఆకర్షణ అందుబాటులోకి వస్తుందన్నారు.
అలాగే కొండపై ఉన్న శ్రీ వెంకటరమణస్వామి ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసి, వీక్షణ స్థలాలు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య వసతులు, మెరుగైన రహదారులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, పర్యాటక అభివృద్ధిని సమన్వయం చేస్తూ పుట్టపర్తిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టూరిజం ఆర్కిటెక్ట్ సూర్యతేజ, జశ్వంత్, టూరిజం మేనేజర్ ప్రతాప్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శివయ్య, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల కూటమి ప్రజాప్రతినిధులు యశోద రాయుడు, కృష్ణప్రసాద్, సురేష్, లావణ్య, మంజు తదితరులు పాల్గొన్నారు.
