తాగునీటి పథకానికి శంకుస్థాపన

రూ.136 కోట్లు మంజూరు

కొత్తచెరువు, మే 22 (ఆంధ్రప్రభ): కొత్తచెరువు మండల కేంద్రంలోని నాగులకట్ట సమీపంలో బుక్కపట్నం చెరువులో రూ.136 కోట్ల వ్యయంతో మంజూరైన సమగ్ర త్రాగునీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్తో కలిసి పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ పథకాన్ని మంజూరు చేసిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తచెరువు మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు దీర్ఘకాలికంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, పథకం పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply