పల్లెల్లో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • ఎక్సైజ్ ఎస్‌ఐకి వినతి

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: సింగనమల నియోజకవర్గంలోని గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపుల వ్యవహారంపై ఎక్సైజ్ ఎస్‌ఐని కలిసి శింగనమల వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో యువత, కూలీలు, పేద కుటుంబాలు ఈ అక్రమ మద్యం విక్రయాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని, వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు.

అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలమైతే, బెల్ట్ షాపుల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని, అవసరమైతే సంబంధిత ఎక్సైజ్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట కూడా నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.

ఈ మద్యం వల్ల అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయని, కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగనమల మండల కేంద్రంలో ఉదయం నాలుగు ఐదు గంటలకే బెల్ట్ షాపులు తీస్తూ మద్యాన్ని విక్రయిస్తున్నారు. నిన్నటి రోజున సింగనమల మండల కేంద్రంలో కుటుంబ పెద్దలను కోల్పోయి ఆ ఇంటిలో ఆడబిడ్డలు అనాథలుగా జీవనం సాగిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఈరోజు అండగా నిలిచింది ఎవరు? వారి జీవితాలకు బాధ్యత ఎవరిది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిర్మూలించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతతో రాజీ పడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని బెల్ట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.