లక్ష్యాల సాధనే ధ్యేయంగా పనిచేయాలి

  • రెఫరెన్స్ లేఖల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
  • మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ శిక్షణలో వెనుకబాటు పై అసంతృప్తి
  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ఆంధ్రప్రభ బ్యూరో , శ్రీకాకుళం : ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ప్రతీ పథకం వంద శాతం అర్హులకు చేరేలా అధికారులు క్షేత్రస్థాయి ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రొటీన్‌కు భిన్నంగా సత్వర ఫలితాలు సాధించాలన్నారు.

నీటి వనరుల సంరక్షణ కోసం చేపట్టిన జలధార పనుల్లో శ్రీకాకుళం జిల్లా అద్భుత ప్రగతిని సాధించిందని, జిల్లాలో మంజూరైన మొత్తం 4,766 పనులకు గానూ ఇప్పటికే 4,756 పనులు (99.79శాతం ) పూర్తయ్యాయని, ముఖ్యంగా గంగువారిసిగడాం, లావేరు, రణస్థలం వంటి మండలాల్లో శతశాతం పనులు ముగిశాయని కలెక్టర్‌ తెలిపారు.

పర్యావరణ సమతుల్యత కోసం నూతనంగా ప్రవేశపెట్టిన నమో వన యోజన కింద నేషనల్ కాంపా నిధులతో ముమ్మరంగా మొక్కలు నాటాలని, హెక్టారుకు 30 వేల నుంచి 40 వేల మొక్కల సాంద్రత ఉండేలా బహుళ అంచెల పద్ధతిలో జియో-ట్యాగింగ్‌ చేస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదే సమయంలో, సచివాలయ సిబ్బందికి, ప్రజలకు డిజిటల్‌ సేవలపై అవగాహన కల్పించే మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ శిక్షణలో జిల్లా కేవలం 15.63శాతం ప్రగతితో రాష్ట్రంలో 16వ స్థానంలో వెనుకబడి ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని 732 సచివాలయాల పరిధిలో ఇప్పటివరకు కేవలం 96,552 గృహాలను మాత్రమే కవర్‌ చేశారని, సరుబుజ్జిలి, జలుమూరు వంటి మండలాలు కొంత మేలైనప్పటికీ మిగిలిన మండలాల అధికారులు తక్షణమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వంద శాతం నమోదు పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, గత వారం 2,93,561 ఇళ్లను సందర్శించి 30,040 చోట్ల గుర్తించిన దోమల ఉత్పత్తి కేంద్రాలను తక్షణమే నివారించగలిగామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన 3,20,333 రక్త నమూనాల్లో కేవలం 6 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని, అలాగే 6 ల్యాబ్‌ల ద్వారా చేపట్టిన 3,837 నీటి పరీక్షల్లో కాలుష్యం శూన్యమని తేలినప్పటికీ, పాఠశాలలు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా పరీక్షలు జరపాలని ఆదేశించారు. సచివాలయాల తనిఖీలు, కోర్టు కేసులు, వీఐపీ రెఫరెన్స్ లేఖల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.