వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వండి

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు బొబ్బల రవీందర్‌రెడ్డి వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవికి తనకు అవకాశం కల్పించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొబ్బల రవీందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర గిరిజన, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తాను చేసిన సేవలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిన్నతనం నుంచే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషి చేశానని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేస్తున్న తన సేవలను గుర్తించి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రవీందర్‌రెడ్డి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. పార్టీ కోసం చేసిన కృషిని మంత్రి అభినందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రం శ్రీనివాస్, ఎస్. కుమార్, డి. రామచంద్ర, బండ శివకుమార్, బొబ్బల అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.