జోరుమీదున్న జింబాబ్వే..

  • వరుస విజయాలతో జోరుమీదున్న జింబాబ్వే
  • జూలై 23 నుంచి భారత్‌తో మూడు టీ20ల సిరీస్
  • పొట్టి ఫార్మాట్‌లో ఓటముల పరంపరకు భారత్ బ్రేక్ వేస్తుందా?
  • ఇంగ్లండ్‌తో వన్డేల్లో పుంజుకున్న టీమిండియా..
  • జింబాబ్వే సవాల్‌కు సిద్ధమవుతుందా?

ఆంధ్రప్రభ : జింబాబ్వే క్రికెట్ జట్టు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టును గెలిచింది.. వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను 32 పరుగుల తేడాతో చిత్తు చేసి మరోసారి తన సత్తా చాటింది.

అయితే జింబాబ్వేకు అసలు పరీక్ష ముందుంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జింబాబ్వే తదుపరి ప్రత్యర్థి టీమిండియానే. జూలై 23 నుంచి హరారే వేదికగా భారత్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్‌పై విజయాలతో దూసుకెళ్తున్న జింబాబ్వే జోరును భారత్ అడ్డుకుంటుందా? లేక టీమిండియా టీ20 కష్టాలను జింబాబ్వే కూడా సొమ్ము చేసుకుంటుందా? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ జూలై 23, 25, 26 తేదీల్లో జరగనుంది.

టీమిండియాకు టీ20ల్లో వరుస షాక్‌లు..

మరోవైపు టీమిండియా ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో… ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ చేతిలో భారత్ 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 0-4 తేడాతో కోల్పోయింది.

వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం భారత జట్టు పర్ఫామెన్స్ పై ప్రశ్నలు రేకెత్తించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భార‌త్…. జింబాబ్వేతో తదుపరి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ఈ సిరీస్‌ను తేలికగా తీసుకునే స్థితిలో లేదు.

వన్డేల్లో మాత్రం భారత్ అదిరిపోయే కమ్‌బ్యాక్

టీ20ల్లో వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి గట్టి పునరాగమనం చేసింది. 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 80 పరుగులతో రాణించగా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జూలై 19న ముగియనుంది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధం కావాల్సి ఉంది.

బంగ్లాను కూల్చేసిన జింబాబ్వే పేసర్లు

తాజా తొలి టీ20లో జింబాబ్వే 170 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ 30 బంతుల్లో 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ర్యాన్ బర్ల్ అజేయంగా 30, సికందర్ రజా 20, బ్రాడ్ ఎవాన్స్ అజేయంగా 19 పరుగులు చేశారు. అనంతరం బంగ్లాదేశ్‌ను జింబాబ్వే పేసర్లు వణికించారు. బ్లెస్సింగ్ ముజరబానీ 17 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టగా, రిచర్డ్ ఎన్‌గరవా 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇద్దరి దెబ్బకు బంగ్లాదేశ్ 138 పరుగులకే కుప్పకూలింది. దాంతో జింబాబ్వే 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇప్పుడు అందరి చూపు భారత్-జింబాబ్వే సిరీస్‌పైనే!

ఒకవైపు జింబాబ్వే విజయ పరంపరలో దూసుకుపోతుండగా, మరోవైపు ప్రపంచ ఛాంపియన్ భారత్ వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురై, ఆ పరాజయాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, జూలై 23న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. బంగ్లాదేశ్‌ను కూల్చిన ముజరబానీ, ఎన్‌గరవా భారత బ్యాటర్లను కూడా ఇబ్బంది పెడతారా? టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో ఓటముల పరంపరకు బ్రేక్ వేస్తుందా? ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి ఈ పోరుపైనే ఉంది!