ప్రతి ఒక్కరినీ ఎస్‌ఐఆర్ సర్వేలో నమోదు చేయాలి

  • మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్‌రావు
  • గిరిజన గ్రామాల్లో విస్తృత పర్యటన.. సర్వే తీరుపై పరిశీలన

జైనూర్, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదయ్యేలా చూడాలని, ఈ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్‌రావు కోరారు.

బుధవారం సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూర్, చేలకగూడ, ఇర్ఫాగూడ, నడుముగూడ, కొద్దుగూడ తదితర గిరిజన గ్రామాలు, గూడాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. నెట్నూర్‌లో నిర్వహించిన సర్వే కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా విశ్వనాథ్‌రావు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదయ్యేలా అధికారులు, బీఎల్‌వోలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సరైన వివరాలు అందించి సర్వేకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

సమస్యలు పరిశీలన.. పరిష్కారానికి కృషి

పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను విశ్వనాథ్‌రావు పరిశీలించారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిన వంతెనలు, రహదారుల దుస్థితిని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. గిరిజన గ్రామాల రవాణా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వంతెనల నిర్మాణంతో పాటు సమస్యల శాశ్వత పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నెట్నూర్ సర్పంచ్ మాడవి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెంధోర్ గణపత్‌రావు, నాయకులు పెందూర్ రాము, భుజంగరావు, లక్ష్మీన్, బాదురావ్, తుకారాం, దతు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.