Telugu Academy | తెలుగు అకాడమీ పగ్గాలు భట్టు రమేష్‌కు..

నూతన డైరెక్టర్‌గా నియామకం
తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తానన్న ఆచార్య భట్టు రమేష్..
మూడు దశాబ్దాల విద్యా అనుభవానికి గుర్తింపు

Telugu Academy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌గా, సీనియర్ అధ్యాపకుడిగా సేవలందించిన భట్టు రమేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగు భాష పరిరక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన, సాహిత్య అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే తెలుగు అకాడమీకి ఆయన నియామకం పట్ల విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆచార్య భట్టు రమేష్‌కు ఉన్నత విద్యా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు పర్యాయాలు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతిగా, గిరిజన అధ్యయన విభాగాధిపతిగా, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

గిరిజన, జానపద సంస్కృతుల పరిరక్షణకు ఆయన విశేషంగా కృషి చేశారు. పలు పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. జానపద, గిరిజన విజ్ఞానానికి సంబంధించి 30కిపైగా పరిశోధనా గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించగా, ఏడు పుస్తకాలను స్వయంగా రచించారు. గిరిజన విద్యార్థుల కోసం ‘బంజారా భారతి’, ‘బంజారా గణితం’ వంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పర్యవేక్షణలో పలువురు పరిశోధకులు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు.

విద్యా రంగంతో పాటు సామాజిక అంశాల్లోనూ ఆయన సేవలందించారు. శాంతి చర్చల మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా, మద్యపాన నిషేధ సలహా కమిటీ సభ్యుడిగా, గిరిజన భూ రక్షణ చట్టాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. బాలకార్మిక నిర్మూలన, గిరిజన మహిళల పునరావాసం వంటి అంశాలపై కూడా కృషి చేశారు. ఆయన విద్యా సేవలను గుర్తిస్తూ 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. గిరిజన సాహిత్యం, జానపద కళల రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా 2017లో డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.

తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆచార్య భట్టు రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాషా వికాసం, పాఠ్యపుస్తకాల నాణ్యత మెరుగుదల, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.