భూ సర్వే పారదర్శకంగా జరగాలి

— రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా సర్వే పూర్తి చేయాలి
— ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ గణపురం: భూ సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు.
బుధవారం గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం, భూపాలపల్లి మండలం ఎస్ ఎం కొత్తపల్లిలో భూ రీసర్వేకు సంబంధించి నిర్వహించిన గ్రామసభలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్‌ అశోక్ కుమార్ , ఆర్డీవో హరికృష్ణ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

— పెద్ద సర్వే నంబర్లపై ప్రత్యేక దృష్టి
ధర్మారావుపేట జిల్లా పరిధిలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామాల్లో ఒకటని, దీని పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా 318, 106, 510 సర్వే నంబర్లు విస్తీర్ణపరంగా పెద్దవిగా ఉన్నందున రెవెన్యూ అధికారులు భూ సరిహద్దులను క్షుణ్ణంగా నిర్ధారించి ఎలాంటి వివాదాలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని సూచించారు.
అదే విధంగా ఎస్ఎం కొత్తపల్లి శివారులో 1325 సర్వే నంబర్లలో 5,954 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు.

— పట్టాదారు పాస్‌బుక్కులు అందేలా చర్యలు

ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు రైతుల సాగుభూములను సమగ్రంగా సర్వే చేసి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. భూ రికార్డులు సక్రమంగా ఉంటే భూముల క్రయవిక్రయాలు సులభతరం కావడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

— నష్టపరిహారం పొందేందుకు ఉపయోగపడుతుంది
భవిష్యత్తులో ధర్మారావు పేట శివారులో సింగరేణి సంస్థ భూసేకరణ చేపట్టే పరిస్థితులు ఏర్పడితే రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం పొందేందుకు కూడా భూ రికార్డులు సక్రమంగా ఉండటం ఎంతో అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రధానంగా భావించి అధికారులు పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు రాజేందర్, ఎలగొండ పద్మ, రెవెన్యూ అధికారులు లక్ష్మీనారాయణ స్వామి, రాజేశ్వరరావు, ఆర్టీఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్య ,గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.