Education | విద్యను వ్యాపారంగా మార్చారు..

బీజేపీపై టీపీసీసీ మహేశ్ గౌడ్ ఫైర్
పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలతో విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపణ..
నీట్ వ్యవహారంపై కేంద్ర వైఖరిని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్

Education | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చిందని, విద్యా ప్రమాణాలు దిగజారేలా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో నిర్వహించిన ‘ఛత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ, విద్యా ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకులు, అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం యువత భవిష్యత్‌పై ప్రభావం చూపుతోందన్నారు. నీట్ పరీక్ష వ్యవహారాన్ని ప్రస్తావించిన ఆయన.. పరీక్షల నిర్వహణలో అవకతవకలు ఆరోపణలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, నైతిక బాధ్యతతో స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా, నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.